రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం శుభకృతు నామ సంవత్సరం ఆరంభమైన ఉగాది పర్వదినాన కనులపండువగా ప్రారంభమైంది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుక మాదాపూర్‌లోని నోవాటెల్లో జరిగింది. పూజా కార్యక్రమాలు అనంతరం హీరో రవితేజ, హీరోయిన్లు నూవుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, కెమేరా స్విచ్ఛాన్ తేజ్ నారాయణ అగర్వాల్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గౌరవ దర్శకత్వం వహించారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీలుక్ మోషన్ పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండిమక్ టైమ్‌లో దర్శకుడు వంశీ నాకీ కథ వినిపించారు. అప్పట్లో నాకు కుదరక చేయలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఆయనకు సరిగ్గా సరిపోయే పాత్ర అన్నారు.
రవితేజతో నాలుగేళ్లుగా ప్రయాణం చేస్తున్నానని దర్శకుడు వంశీ అన్నారు. ఈ కథకు ఆయనే బాగుంటారని మేము అనుకోవడం దానికి ఆయన ఒప్పుకోవడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇది రవితేజ అభిమానులే కాదు అందరు తెలుగు హీరోల ఫ్యాన్స్ మెచ్చే చిత్రమవుతుందని హామీ ఇస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు తేజ, సుధీర్ వర్మ, త్రినాథ్ నక్కిన, శరత్ మండవ, శ్రీకాంత్ విస్సా, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.