అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ఓ వీధికి గణేశ్ టెంపుల్ స్ట్రీట్ అని నామకరణం చేశారు. న్యూయార్క్ క్వీన్స్ కౌంటీలోని ప్లషింగ్లో 1977లో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో మహా వల్లభ గణపతి దేవస్థానాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఆ దేవాలయాన్ని గణేశ్ టెంపుల్ అని పిలుస్తున్నారు. ఇది ఉత్తర అమెరికాలోని పురాతన హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడున్న ఎన్నారైలు ఆలయాన్ని వెళ్లి పూజలు, అర్చనలు చేస్తున్నారు. ఆ గుడి బయట ఉన్న వీధికి బౌనీ స్ట్రీట్ అని పేరు. బానిసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ అమెరికన్ మార్గదర్శకుడు జాన్ బౌనీ పేరు ఆ వీధికి పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ వీధికి గణపతి ఆలయం అనే పేరును కూడా జత చేశారు. ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ గౌరవార్థం ఆ వీధికి బౌనీ పేరుతో పాటు గణేశ్ టెంపుల్ స్ట్రీట్‌గా అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కడున్న భారతీయులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ పేరు మార్చే కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్, క్వీన్స్ బరో అధ్యక్షుడు డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, దిలీప్ చౌహాన్, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)