బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యవహారం పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదని, ఆత్మ వంచన అని తీవ్రంగా దుయ్యబట్టారు. తాను మోసపోతూ, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఆయనకు ఎంత గౌరవిమిచ్చిందో ఆయనే ఆత్మ విమర్శ చేసుకుంటే అర్థమవుతుందని చురకలంటించారు. ఎవరో లేఖ రాస్తే ఈటలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా సీఎం కేసీఆర్‌తో దూరం పెరిగితే, ఆయన కేబినెట్‌లో ఎలా కొనసాగారని నిలదీశారు. ఈటలకు తమ పార్టీ ఎలాంటి అన్యాయమూ చేయలేదని, ఎంత కష్టమైనా ఆయనకు టిక్కెట్ ఇచ్చామన్నారు. టీఆర్ఎస్ పదవుల్లో ఉంటూ ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులకు దిగారని, రాజేందర్‌ది ముమ్మాటికీ ఆత్మవంచననే అని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తానని ప్రకటించారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు టీఆర్‌ఎస్ ఏం అన్యాయం చేసిందని ఆయన పాదయాత్రకు సిద్ధమయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏవో ఆరోపణలు చేయాలి కాబట్టే, తమపై ఆరోపణలకు దిగుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.