బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యుల నుంచే ఎదురైన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రధానిగా ఆయనే కొనసాగాలని 211 మంది ఓటు వేయగా 148 మంది వ్యతిరేకించారు. 2020 జూన్‌లో కొవిడ్ ఉధ్ధృతంగా ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి పార్టీ సహచరులు, ప్రభుత్వ అధికారులతో మద్యం విందులో పాల్గొనడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీన్ని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు తప్పుపట్టారు. ఈ వ్యవహారం ఓటర్లలో పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పదవి నుంచి జాన్సర్ వైదొలగాలంటూ కొద్ది వారాల క్రితం 40 మందికి పైగా టోరీ ఎంపీలు బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బోరిస్‌పై కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం జాన్సన్ మాట్లాడుతూ 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం తనకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఇది చాలా సానుకూల, నిర్ణయాత్మకమైన ఫలితం అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)