ఒడిశాలోని పూరీలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయ జయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలను భక్తులు తిలకించలేకపోయారు. ఈసారి అనుమతించడంతో పూరీ నగరానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు. జగన్నాథ నామ స్మరణతో పూరీ విధులు మార్మోగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో బయలుదేరారు. అవి బయలుదేరడానికి ముందు సంప్రదాయం ప్రకారం పూరీ మహారాజు దివ్యసింగ్ దేవ్ ఆ మూడు రథాల ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చారు. అనంతరం రథాలు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్, గుండిచా మందిరం వైపు కదిలాయి. ఈ రథయాత్రలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.