అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)అధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. టీటీడీ అర్చకుల చేతుల మీదుగా సంప్రదాయ బద్దంగా జరిగింది. ఈ క్రతువులో ఆటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల, కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు, కార్యవర్గ సభ్యులు భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, లడ్డూలను అందజేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించగా.. ప్రముఖ గాయని శోభరాజు తన గానంతో భక్తుల్ని అలరించారు.
ఆటా వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయి. త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి అవధానం అలరించింది. రావు తల్లా ప్రగడ, తనికెళ్ల భరణి, కూచిభొట్ల ఆనంద్, తుమ్మలపల్లి వాణీకుమారి, రెజీనా, వేముల లెనిన్, కొల్లారపు ప్రకాశరావు, రవి, మాధురి చింతపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.