ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం శాసనసభ. డా॥ రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, హెబ్బాపటేల్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో ఇంద్రసేన మాట్లాడుతూ ఈ సినిమాకు రచయిత రాఘవేంద్ర రెడ్డి కమర్షియల్ హంగులు కలబోసిన అద్భుతమైన కథనందించాడు. కొన్నేళ్ల నుంచి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమా నా కెరీర్‌కు బ్రేక్ నిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాతో ఇంద్రసేన యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. నా అభిమాన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ వేడుకకు అతిథిగా హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు చిన్నికృష్ణ, నిర్మాత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీకృష్ణ, భూషన్, మహేష్, మయాంక్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)