అమెరికాకు చెందిన జెట్‌ప్యాక్ ఏవియేషన్ సంస్థ గాల్లో ఎగిరే బైక్‌ను తయారు చేస్తున్నది. తాము తయారు చేస్తున్న బైక్ స్పీడర్ నమూనాను సంస్థ విజయవంతంగా పరీక్షించింది. హెలికాప్టర్ లాగా లంబంగా గాల్లోకి ఎగరగల ఈ బైక్ అగ్ని ప్రమాదాలు, అత్యవసర వైద్య సదుపాయాలు అందించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత నమూనా ప్రకారం ఇది హెలికాప్టర్‌ను తలపించినప్పటికీ హెలికాప్టర్ కంటే ఎత్తులో, దాని కంటే వేగంగా ప్రయాణించగలదు. ఈ బైక్‌పై ఇద్దరు వెళ్లవచ్చు. మనిషి లేకుండా దానంతట అది కూడా (అటానమస్) ప్రయాణించగలదు.
దక్షిణ కాలిఫోర్నియాలో దీనిని పరీక్షించారు. బైక్ 15 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరింది. గంటకు 480 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనున్నది. దీని ధర 2.83 కోట్లు. ఇంకా పెరుగవచ్చని జెట్‌ప్యాక్ ఏవియేషన్ సీఈవో డేవిడ్ మేమ్యాన్ చెప్పారు. దీన్ని నడపడానికి పెద్దగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరీక్షించింది బైక్ తొలి నమూనాను మాత్రమే. బైక్‌కు తుది రూపం ఇంకా రాలేదు. ప్రస్తుతం నాలుగు ఇంజిన్లతో బైక్‌ను ఎగిరించారు. ఇందులో జెట్ టర్బైన్‌ను వినియోగించారు. బైక్‌కు తుదిరూపం వచ్చే సరికి ఎనిమిది ఇంజిన్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది జెట్ ఇంధనం. డీజిల్, కిరోసిన్‌తో నడుస్తుంది.