అమెరికన్ పార్లమెంట్ నిర్దేశించినట్టుగా 2023 ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్ 1బీ వీసాల జారీకి సరిపడినన్ని దరఖాస్తులు అందినట్లు ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం అవసరమైన పోస్టుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోనేందుకు హెచ్ 1బీ వీసా వీలుకల్పిస్తుంది. ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడి ఏటా భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేలమంది ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. విదేశీ వృత్తి నిపుణుల్లో వర్క్ వీసా తర్వాత హెచ్ `1బీ వీసాకే ఎక్కువ ఆదరణ ఉన్నది.
2023లో 65 వేల హెచ్ 1బీ వీసాలతోపాటు అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు పథకం కింద మరో 20 వేల హెచ్ 1బీ వీసాల జారీకి అవసరమైనన్ని దరఖాస్తులు వచ్చినట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఓ ప్రకటనలో వెల్లడిరచింది. రిజిస్ట్రెంట్ల(నమోదుదారుల) ఆన్‌లైన్ ఖాతాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపామని, వీసాలకు ఎంపిక కానివారికి నాట్ సెలెక్టెడ్ అనే సందేశం వస్తుందని పేర్కొన్నది. పరిమితి నుంచి మినహాయింపులున్న పిటిషన్లను మాత్రం స్వీకరించి, ప్రాసెస్ చేస్తామని తెలిపింది. దీంతోపాటు ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు హెచ్ 1బీ వీసా గడువు పొడిగింపు, ఉద్యోగ నిబంధనల మార్పు, కొత్త కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.