అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు ఎఫ్1 వీసాల జారీని ప్రారంభించింది. అయితే, ఈసారి డ్రాగన్ కంట్రీని కాదని, ఇండియాకు అగ్రరాజ్యం పట్టం కట్టింది. దాంతో చైనా విద్యార్థుల కంటే భారత స్టూడెంట్స్‌కు విద్యార్థి వీసాలు అధిక సంఖ్యలో దక్కాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం 2022 జనవరి నుంచి జూలై వరకు 77,799 మంది భారత విద్యార్థులు ఎఫ్1 వీసాలు పొందారు. అదే సమయంలో చైనాకు కేవలం 46,145 వీసాలు మాత్రమే దక్కాయి. అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత స్టూడెంట్స్ కంటే చైనీస్ విద్యార్థులకే భారీ సంఖ్యలో ఎఫ్1 వీసాలు జారీ అయ్యేవని తెలుస్తుంది. అయితే, కరోనా విజృంభణ మొదలైన 2020లో మాత్రం చైనా నుంచి కేవలం 4,853 మందికే స్టూడెంట్ వీసాలు దక్కాయి.
భారత్ విషయానికి వస్తే 21,908 మంది విద్యార్థులు ఎఫ్1 వీసాలు పొందారు. ఇక 2021లో మాత్రం చైనా పుంజుకుంది. ఆ ఏడాది మొత్తంగా 99,431 మంది విద్యార్థులను యూఎస్ పంపించింది. భారత్ నుంచి 87,258 మంది విద్యార్థులు వెళ్లడం జరిగింది. ఇదిలాఉంటే.. అమెరికా తర్వాత విదేశీ విద్యార్థులను ఆకర్షించే దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది యునైటెడ్ కింగ్‌డమ్. అయితే, గత కొంతకాలంగా బ్రిటన్ కూడా భారత విద్యార్థులకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చైనాతో పోలిస్తే భారతీయ విద్యార్థులకు భారీ మొత్తంలో వీసాలు జారీ చేస్తోంది. ఇటీవల యూకే జారీ చేసిన 4,86,868 విద్యా వీసాలలో 1,17,965 మంది భారతీయ విద్యార్థులు పొందడం విశేషం.