అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పైలట్ ఏకంగా విమానాన్ని చోరీ చేశాడు. ఆ విమానంతో గాల్లో చక్కర్లు కొడుతూ స్థానిక వాల్‌మార్ట్ స్టోర్‌ను కూల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి భయాందోళనలు సృష్టించాడు. దీంతో పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు. 29 ఏళ్ల ఓ పైలట్ టుపేలో విమానాశ్రయంలోని ఓ విమానాన్ని దొంగిలించాడు. ఆపై ఆ విమానంతో నగరంలో చక్కర్లు కొడుతూ స్థానిక వాల్‌మార్ట్ స్టోర్‌ను ఆ విమానంతో ఢీకొట్టి ధ్వంసం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఊహించని పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు టుపేలోని వాల్‌మార్ట్‌తో పాటు సమీప ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించారు. అతడు చెప్పినట్లు విమానాన్ని పేల్చేస్తే భారీ స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు.
ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చివేస్తానని బెదిరించిన పైలట్‌తో తాము సంప్రదింపులు జరుపుతున్నామని టుపేలో పోలీసులు విభాగం వెల్లడిరచింది. దీనిపై స్థానిక గవర్నర్ టేట్ రీవ్స్ మాట్లాడుతూ అత్యవసర విభాగం అధికారులు ఈ ప్రమాదకరమైన పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని, పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే పోలీసుల సంప్రదింపులు సఫలమైనట్లు తెలుస్తోంది. ఓ ఖాళీ ప్రదేశంలో పైలట్ విమానాన్ని దింపినట్లు సమాచారం.