తైవాన్‌కు మద్దతు విషయంలో అగ్రరాజ్యం అమెరికా మరో అడుగు ముందుకేసింది. చైనా దూకుడుతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ ఆ ద్వీప దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి తాజాగా 1.1 బిలియన్ డాలర్ల ఆయుధాల ప్యాకేజీని ప్రకటించింది. శత్రు దేశాల క్షిపణుల ట్రాకింగ్ కోసం 665 మిలియన్ డాలర్ల విలువైన ముందస్తు రాడర్ హెచ్చరిక వ్యవస్థ, యుద్ధనౌకలను నీటముంచే సామర్థ్యం కలిగిన, 355 మిలియన్ డాలర్ల విలువైన 60 అధునాతన హార్పూర్ యాంటీ షిప్ క్షిపణులతో పాటు 100 ఎయిర్ టు ఎయిర్ సైడ్‌విండర్ క్షిఫణుల విక్రయాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయని అమెరికాకు చెందిన రక్షణ భద్రత సహకార ఏజెన్సీ తెలిపింది.
తైవాన్ పై డ్రాగన్ తన ఒత్తిడి పెంచుతూనే ఉన్నందున ఆ దేశానికి దాని స్వీయ రక్షణ సామర్థ్యాలు కొనసాగించేందుకుగానూ అవసరమైన సైనిక సాయం అందజేస్తున్నాం అని వైట్‌హౌస్ సీనియర్ డైరెక్టర్ లారా రోసెన్‌బర్గర్ తెలిపారు. తైవాన్ భద్రతకు ఈ ప్యాకేజీ అత్యవసరమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అన్నారు. ఈ విక్రయాలను సాధారణ ప్రక్రియగానే పేర్కొంటూ బలగాల ఆధునీకరణ, రక్షణ సామర్థ్యాల నిర్వహణ విషయంలో తైవాన్ ప్రయత్నాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చైనా సైనిక చర్యలను ఎదుర్కొనేందుకు ఈ ఆయుధాల కొనుగోలు సహాయపడుతుందని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. ఈ మేరకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది.