బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె ఆ దేశ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వెస్ట్‌మినిస్టర్‌లోని కాన్ఫరెన్స్ సెంటర్‌లో సర్ గ్రహం బ్రాడీ ప్రకటన చేశారు. కన్జర్వేటివ్ రేసులో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు పోలయ్యాయి. రిషి సునాక్‌కు 60,399 ఓట్లు పడ్డాయి. దీంతో దాదాపు 21 వేల ఓట్ల తేడాతో సునాక్‌పై లిజ్ పైచేయి సాధించారు. మొత్తం ఎలక్టరేట్ సంఖ్య 1,72,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేపర్లను తిరస్కరించారు. బోరిస్ జాన్సన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కన్జర్వేటివ్ పార్టీలో పోటీ జరిగింది. అయితే రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య చివరి వరకు ఉత్కంఠ పోరు సాగింది. అనూహ్య రీతిలో రిషి సునాక్ కన్జర్వేటివ్ నేత రేసులో ఓటమి పాలయ్యారు. విజయం సాధించిన లిజ్ ట్రస్ ఇప్పుడు ఆ దేశ ప్రధాని కానున్నారు.
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్ ట్రస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ధైర్యమైన ప్రణాళికలను అందిస్తానన్నారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు.