తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత ఉద్యోగులను వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీలపై ఎక్కువ శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉండాలని పేర్కొన్నారు. సహాయక చర్యల విషయంలో స్థానిక శాఖలన్నీ పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. వరద నీటిలో చిక్కుకున్న వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీని కూడా అలర్ట్ చేసిన కేటీఆర్
రెండు రోజులుగా హైదరాబాద్ సిటీలోనూ వర్షాలు పడుతున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో కూడా కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండాలని, ప్రజలకు తగిన సహాయాలు చేయాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలోనే ఉండాలని సూచించారు. వరదలు, నీటిలో చిక్కుకున్న వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.