మద్రాసీలుగా పిలిచే తెలుగు ప్రజలకు అది అందర్నీ శాసించే జాతి అనే స్థాయి గుర్తింపు తేవడంలో టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన కృషి అనన్య సామాన్యమైనదని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు ఈ సందర్భగా జయరాం మీడియాతో మాట్లాడుతూ అన్నగారికి ఆయన సొంత జిల్లా (పూర్వపు కృష్ణా)లో అవమానిస్తూ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడం అత్యంత హేయమైనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు తొలగించడమంటే ఆయనకు నష్టం చేసినట్లు కాదని తెలుగువారిని నొప్పించినట్లు అని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పొరపాటు ఆయనకు రాజకీయ సమాధి కట్టనుందని హెచ్చరించారు. జగన్ వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రతి తెలుగువాడు తిరగబడతారన్నారు. అది ఒక ఉద్యమంలా పైకి కనిపించకపోయినా ఓటు రూపంలో ఓ పోటు జగన్‌కు తెలుస్తుందన్నారు. ఎన్టీఆర్ నెలకొల్పిన తొలి వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం చారిత్రక తప్పదమన్నారు. జగన్ తన తప్పు తెలుసుకుని వెంటనే ఎన్టీఆర్ పేరు పెడితే మంచిది, లేదంటే తిరిగి ఎన్టీఆర్ పేరు ఈ యూనివర్సిటీకి పెట్టే వరకు తెలుగు ప్రజలు ఆ విషయాన్ని వదిలిపెట్టరన్నారు.