దివంగత చమన్ సాబ్ జీవితం, ఆదర్శప్రాయమైన ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు తెలియ చేయాలనే ఉద్దేశంతో రూపొందిస్తున్న సినిమా చమన్. ఎడారిలో పుష్పం అనేది ఉపశీర్షిక. వెంకట్ సన్నిధి దర్శకత్వంలో జివి 9 ఎంటర్‌టైన్ మెంట్ సంస్థ ద్వారా జీవి చౌదరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత జివి చౌదరి మాట్లాడుతూ చమన్‌సాబ్ బతికున్న రోజుల్లోనే ఈ స్క్రిప్ట్ పూర్తి చేశాం. కరోనా కారణంగా ఆలస్యమైంది. చమన్ కుమారుడైన ఉమర్ ముక్తర్ బర్త్‌డే కానుకగా ఈ సినిమాకు చమన్ టైటిల్‌ను ప్రకటించడం సంతోషంగా ఉంది. అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి చమన్‌సాబ్. ఈ సినిమాకు కెమెరామెన్‌గా సి.రామ్‌ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమాన్ పని చేస్తున్నారు అని అన్నారు. దర్శకుడు వెంకట్ సన్నిధి మాట్లాడుతూ చమన్ సాబ్ ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జీవిత కథ ఆధారంగా కమర్షియల్ హంగులతో పాటు నిజాన్ని నిక్కచ్చిగా తెర మీద చూపించబోతున్నాం. ఆయన గురించి ఈ తరం యువతకి తెలియాల్సిన కథ ఇది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి.రాంప్రసాద్, మోహిత్ రెహమాన్య తదితరులు పాల్గొన్నారు.