పాకిస్థాన్ కేంద్రంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదులను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చి, వారిపై విధించాలన్న తమ ప్రతిపాదనను కొన్ని దేశాలు ఆకారణంగా పదే పదే అడ్డుకుంటున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆక్షేపించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించేందుకు అమెరికాకు వచ్చిన ఆయన తన పర్యటన ముగింపు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు పారదర్శకత అవసమరనీ, ఎలాంటి కారణాలు చూపకుండా ఒక ప్రయత్నాన్ని అడ్డుకోవడం తగదని తెలిపారు. ఉగ్రవాదం రాజకీయపరమైనది కాదనీ, దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవడం తగదని అన్నారు.
ఉగ్రవాదులపై చర్యల విషయంలో భారత్ ప్రయత్నాలకు ఎదురవుతున్న ఆవరోధాలపై అటు సదస్సులో, ఇటు బ్రిక్ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీలో ప్రధానంగా లేవనెత్తినట్టు ఆయన తెలిపారు. ఉగ్రవాదంతో ముప్పు ఉందని అన్ని దేశాలూ చెబుతుంటాయనీ, చర్యలు మాత్రం దానికి అనుగుణంగా ఉండడం లేదని విమర్శించారు. రుణాలు, ఆహార సరఫరా, ఇంధన భద్రత వంటి అంశాల్లో జి`20 దేశాలతో కలిసి భారతదేశం పనిచేస్తుందని తెలిపారు. భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారత్ పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ప్రపంచ భారత్‌ను తృతీయ ప్రపంచ దేశాల గళంగా పరిగణిస్తోందని తెలిపారు. భారత్ ఒక వారధి, ఒక గళం, ఒక దృక్కోణం, ఒక దారి అని పేర్కొన్నారు.