నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ది ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ ది ఘోస్ట్ సినిమా కసితో తీశాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. అద్బుతమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. నారాయణ్‌దాస్ నారంగ్గారికి ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైంది. దర్శకుడితో పాటు టెక్నీషియన్స్ అందరూ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా నాగార్జున గారు ఓ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌ని అందించబోతున్నారు. ఫైనల్ కాపీ చూసి మేము చాలా ఎక్సైట్ అయ్యాం. థియేటర్లో ప్రేక్షకులు కూడా అదే అనుభూతికి లోనవుతారు అని తెలిపారు. నటి సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంతో నాగార్జునతో కలిసి తొలిసారి యాక్షన్ చేసే అవకాశమొచ్చింది అంది. ఈ కార్యక్రమంలో జాన్వీ, సునీల్ నారంగ్, ఆదిత్ మరార్, విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.