ఖతర్‌లో పూలపండుగ బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఖతర్ ఆధర్వంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు. ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మను పూజించారు. ఖతర్ ఫుట్‌బాల్ స్టేడియం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ పాటను విడుదల చేశామని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట పాటలతో అలరించారని చెప్పారు. గల్ఫ్ కార్మిక సోదరులు పల్లె పాటలతో ధూమ్ ధాంగా పాల్గొన్నారని తెలిపారు. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 15 వందల మందికిపైగా పాల్గొన్నారని వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంప్రదాయ వేడుకకు ఖతర్‌లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ సతీసమేతంగా హాజరయ్యారు. ఐసీబీఎఫ్ అధ్యక్షులు వినోద్ నాయర్, ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తి హాజరయ్యారు.