బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ గురువారం రాజీనామా చేశారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. కేవలం 45 రోజుల పాటే బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నారు. బ్రిటన్ ప్రధానిగా ఆమె తీసుకున్న పలు ఆర్థిక కార్యక్రమాలు అక్కడి మార్కెట్లను భారీ కుదుపులకు గురిచేయడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా పెట్టుబడులు రాకుండా పోయాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క రోజు క్రితం ఆమె క్యాబినెట్‌లోని హోం మంత్రి రాజీనామా చేయగా.. పది రోజుల క్రితం ఆర్థిక మంత్రిని పదవి నుంచి తప్పించారు. ఒకదాని వెంట ఒకటిగా లిజ్ ట్రస్‌కు షాక్‌లు తగులుతున్నాయి.
తన అధికారిక నివాసం నంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద గురువారం లిజ్ ట్రస్ మాట్లాడుతూ.. తనపై పార్టీ విశ్వాసాన్ని కోల్పోయిందని, తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయానని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. దాంతో బ్రిటన్ రాజుతో సంప్రదించిన మీదట ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.