అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమన్లు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ ప్యానల్ ఆ ఆదేశాలను ఇచ్చింది. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించిన తొలి అమెరికా అద్యక్షుడివి నువ్వే అంటూ ఆ సమన్లలో పేర్కొన్నారు. అన్యాయం, రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసి కూడా ప్రజల్ని రెచ్చగొట్టినట్లు ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. క్యాపిటల్ హిల్ దాడి ఘటనను విచారిస్తున్న చట్టసభ ప్రతినిధుల ముందు నవంబర్ 14వ తేదీలోగా హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఒకవేళ సమన్ల ప్రకారం విచారణకు ట్రంప్ హాజరుకాకుంటే అప్పుడు ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ప్రభుత్వం విఫలమైందని, వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు తనకు సమన్లు జారీ చేసినట్లు ట్రంప్ అన్నారు. విచారణ కమిటీ అన్ని రూల్స్‌ను ఉల్లంఘించినట్లు ట్రంప్ తరపు న్యాయవాది తెలిపారు.