ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్‌ల్లో స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆవిష్కరించారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ ఉత్సవాలను జ్యోతి వెలిగించి, భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ భారత దేశ ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పథకాలు, సంస్కరణలకు వివరించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించడానికి తీసుకున్న చొరవను, ఎంపీ కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీని కొనియాడారు. విగ్రహావిష్కరణకు సహకారం అందించిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాలలో మొదటి సారిగా సిడ్నీ స్ట్రాత్ ఫీల్డ్‌లో ఆవిష్కరించండం చాలా గర్వంగా ఉందని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని నేటివ్ ఆబొరిజన్స్‌ను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు విదేశాల్లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప కార్యక్రమాని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్లు రాజ్ దత్తా, శ్రీని పిల్లమర్రి, లివింగ్ స్టర్ చెట్టిపల్లి, పీవీ బంధువు డాక్టర్ హేమచంద్ర, ఇతర కుటుంబ సభ్యులు, డాక్టర్ భారతిరెడ్డి, హర్ మోహన్ వాలియా, పీవీఎన్ఆర్ లోకల్ కోర్ కమిటీ సభ్యులు కేరీరెడ్డి, అరవింద్, రాజేష్ రాపోలు, కిషోర్ బెండె, వెంకటరమణ, ఉపేందర్ గాదెతోపాటు స్థానిక ఇండియన్, తెలుగు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.