అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను బోస్టన్ నగరం సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు సహా మిని వ్యాన్, ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గరు విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన పాటంశెట్టి సాయి నరసింహా, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన పావని, హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు ప్రేమ్‌కుమార్ రెడ్డి గా పోలీసులు గుర్తించారు. వర్షం, పొగమంచు కారణంగా ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోవడానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్లను విచారించనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. తమ బిడ్డలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుసుకుని మృతుల తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.