గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నివాసితులకు ఒమన్ బంపరాఫర్ ప్రకటించింది. అసలు వీసాయే అవసరం లేకుండా సుల్తానేట్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. జీసీసీ రెసిడెంట్స్కు అన్ని వాణిజ్య వృత్తుల కోసం ఒమన్లోకి వీసా-ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉందని ఒమన్ ఎయిర్పోర్ట్స్ తన సర్క్యులర్లో పేర్కొంది. జీసీసీ నివాసితుల వీసాకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ నుంచి ఒమన్ విమానాశ్రయాలకు అందిన ఆదేశాల ఆధారంగా ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలియజేసింది.
జీసీసీ దేశాలలోని నివాసితులందరికీ అన్ని వాణిజ్య వృత్తుల కోసం సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించే హక్కు ఉంటుంది. ప్రజలు నివసించే దేశం నుండి రావాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఏ సమయంలోనైనా వారు ఏ గమ్యస్థానం నుంచి వచ్చినా ఒమన్లోకి అనుమతించనున్నట్లు ఒమన్ ఎయిర్పోర్ట్స్ వెల్లడించింది. అయితే, నివాస వీసా మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో జీసీసీలో చెల్లుబాటయ్యేలా ఉండాలని స్పష్టం చేసింది. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జీసీసీ దేశాల నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
