అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఓర్లండో సిటీలో ఐటీ సర్వ్ సైనర్జీ పేరిట నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. అమెరికాలో మన తెలుగువారు సుమారు 30 వేల ఐటీ కంపెనీలను స్థాపించడం. అమెరికా దేశస్థులలో తలసరి సగటు ఆదాయంలో మన తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండడాన్ని చూసి సాటి తెలుగువాడిగా గర్విస్తున్నానని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. అమెరికాలోని రాజకీయ రంగంలో కూడా మన తెలుగు వారు పట్టు సాధించాలన్నారు. విద్య, వైద్యం, ఐటి, వ్యాపార రంగాలతో పాటుగా ఇటీవల వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలోనూ మన తెలుగు వారు ప్రవేశించి ఘన విజయాలు సాధించడం తెలుగు జాతికి గర్వ కారణం అని వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో అమెరికాలో ఉన్న మన తెలుగువారంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పరస్పర సహాయ సహకారాలు అందించుకుని, భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షులు జయ తాల్లూరి, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, తానా ప్రెసిడెంట్‌గా ఎలెక్ట్ అయిన నిరంజన్ శృంగవరపు, తానా ట్రెజరర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రముఖ పారిశ్రామికవేత్త బొబ్బా రామ్, ఎన్నారై టీడీపీ లీడర్‌లు రవి మందలపు, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనాథ్ రావుల, ప్రసాద్ ఆకినేని, విజయ్, వెనిగళ్ళ రవి, హరీష్ కోయ, శ్రీనివాస్ తాతినేని, కెనడా దేశం నుంచి అనిల్, ప్రముఖ ఐటీ కంపెనీలు, వివిధ వ్యాపార రంగాలకు చెందిన కంపెనీల ఆధిపతులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు భారీ ఎత్తున జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో సుమారు 1500 మంది తెలుగువారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ఐటీ కంపెనీలు, వివిధ వ్యాపార రంగాలకు చెందిన అధిపతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.