అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన దేశ రాజధాని ఢల్లీి చేరుకుంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడిరచింది. అమెరికాలో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి భారత్‌కు రానున్నారు. ఈ నెల 28న ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ కానున్నారు. అమెరికా విదేశాంగ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆయన ప్రధాని మోదీని సైతం కలవనున్నారు.
భారత్, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను ఉన్నత స్థాయిలో బలపరచడంతో పాటు భవిష్యత్తులో అవి మరింత ధృడంగా కొనసాగేలా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ చర్చల్లో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రానున్నాయని తెలిపింది. కోవిడ్ 19 మహమ్మారి ప్రస్తావన కూడా ఇందులో రానున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండో పసిఫిక్ ప్రాంతం, అఫ్గానిస్తాన్ వ్యవహారం, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు కేంద్రం తెలిపింది.