యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే, అక్కడికి వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. యూఏఈతో పాటు ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమ పాస్‌పోర్టులలో వారి ప్రాథమిక (మొదటి పేరు), ద్వితీయ (ఇంటిపేరు) తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు ఓ ప్రత్యేక సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఎయిరిండియా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం, పాస్‌పోర్టులో ప్రయాణికుడి పూర్తి పేరు ఉండాలి. కేవలం పేరు మాత్రమే ఉండి ఇంటి పేరు లేకపోతే ఆ పాస్‌పోర్టు హోల్డర్‌ను యూఏఈ ఇమ్మిగ్రేషన్ విభాగం అంగీకరించదు. అలాంటి ప్రయాణికులను ఐఎన్ఏడీగా(ప్రయాణానికి అనుమతి లేదు) పరిగణిస్తుంది. ఈ కొత్త రూల్ నవంబర్ 21 నుంచి అమలులోకి వస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది. టూరిస్ట్ లేదా విజిట్ వీసాపై ప్రయాణించే వారికి కూడా ఈ రూల్ వర్తింస్తుందని స్పష్టం చేసింది. కాగా, రెసిడెన్సీ లేదా ఉపాధి వీసాలను మాత్రం ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తన సర్క్యూలర్‌లో పేర్కొంది.