అమెరికాలో కాల్పలు కలకలం రేపుతున్నాయి. వర్జీనియా రాష్ట్రంలోని చీసాపీక్లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. చాలా మందికి గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన గురించి సమాచారం అందుకున్న చెసాపీక్ పోలీసులు వెంటనే వాల్‌మార్ట్ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి 10:12 గంటలకు కాల్పుల గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తి స్టోర్ మేనేజర్ అని సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పారు. మేనేజర్ బ్రేక్ రూమ్‌లోకి ప్రవేశించి ఇతర స్టోర్ ఉద్యోగులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అతను కూడా తుపాకీ తనవైపు తిప్పుకుని కాల్పుకున్నట్లు సమాచారం. దుకాణం లోపల కాల్పులు జరిగినట్లు భావిస్తున్నామని, అనుమానితుడు ఒంటరిగా ప్రవర్తించాడని అధికార ప్రతినిధి లియో కోసిన్స్కీ తెలిపారు. వాల్‌మార్ట్ స్టోర్ వెలుపల భారీ పోలీసు బలగాలు మోహరించారు. దీంతో పాటు 40కి పైగా ఎమర్జెన్సీ వాహనాలు కూడా భవనం వెలుపల సిద్ధంగా ఉంచారు. అయితే ప్రస్తుతానికి భవనం నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. కాల్పులకు సంబంధించి కారణాలు తెలియరాలేదన్నారు.