ఇంజనీర్ల వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణకు గల్ఫ్ దేశం ఒమన్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ కార్మికమంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంజనీర్ల వర్క్ పర్మిట్ల కోసం కొత్త నిబంధనలు రూపొందించినట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న వారికి తప్పనిసరిగా ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్‌ను అమలు చేస్తామని తెలిపింది.
వర్కింగ్ ఇంజనీర్స్ అందరూ తమ వర్క్ పర్మిట్ల రెన్యువల్ లేదా కొత్తవాటి కోసం ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 1వ తారీఖు నాటికి వర్క్ పర్మిట్ల జారీకి, పునరుద్ధరించడానికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ తప్పనిసరి చేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. కనుక గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఇంజనీర్లను కోరింది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థలకు కార్మిక శాఖ నోటీసు జారీ చేసింది.