Namaste NRI

అలా చేయలేనప్పుడు రిటైర్‌ కావడమే : చిరంజీవి

చిరంజీవి  హీరోగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.  సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమం  హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ హీరో ఎవరైనా మల్టీస్టారర్‌ చిత్రాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఒప్పుకున్న కథ కోసం ఎంతైనా శ్రమించాలని, అలా చేయలేనప్పుడు రిటైర్‌ కావడమే శ్రేయస్కరం అనుకుంటాని అన్నారు.  సినిమాలో నటించేప్పుడు నేనొక మెగాస్టార్‌ ను, ఇప్పటికే ఎంతో సాధించానని అనుకోను. సెట్‌ లో కష్టపడుతున్నప్పుడు నాకు తెర ముందు కూర్చున్న అభిమానులు, ప్రేక్షకులే గుర్తొస్తారు. వాళ్ల కోసం ఎంతైనా శ్రమించాలని అనిపిస్తుంది. అలా చేయలేనప్పుడు రిటైర్‌ కావడమే మంచిదనుకుంటాను. మనల్ని తెరపై ఎలా చూపించాలో ఒక అభిమానికి తెలిసినంత మరెవరికీ తెలియదు. ఒక అభిమానిగా బాబీ నన్ను ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు చేర్చి అద్భుతంగా చూపించాడు. రవితేజతో కలిసి నటించడాన్ని ఆస్వాదించాను. ఇండస్ట్రీలో నేను ఏ హీరోతోనైనా మల్టీస్టారర్‌ చిత్రంలో నటించేందుకు సిద్ధం. సంక్రాంతికి మా సినిమాతో పాటు బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం కూడా రిలీజ్‌ అవుతున్నది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాలి  అన్నారు.

అన్నయ్యకు నేను పెద్ద అభిమానిని ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని ఎవరు కాదనుకుంటారు, దర్శకుడు బాబీపై నాకు చాలా నమ్మకముంది అని హీరో రవితేజ అన్నారు.  దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నప్పుడు అన్నయ్య చిరంజీవి గారిని ఒక అభిమానిగా కలిసిన సందర్భాలు గుర్తుకొచ్చేవి. ఈ సినిమాలో యాక్షన్‌ తో పాటు కావాల్సినంత ఎమోషన్‌ ఉంటుంది. రవితేజ గారిని కథలోకి తీసుకొచ్చినప్పుడు చిరంజీవిగారు ఏమాత్రం సందేహించకుండా అంగీకారం తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుంది  అన్నారు.  ఈ కార్యక్రమంలో హీరో రవితేజ, చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాతలు వై రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events