రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధమాకా. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ ధమాకా కి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంత కాదు. పండగ చేసుకొని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంతో పండగొచ్చింది. ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి అన్నారు. ఈ చిత్ర విజయానికి తొలి కారణం మా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ఈ సినిమాకి సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. తన సంగీతంతో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. పీపుల్స్ మీడియా ఈ సినిమాని ఎంతో చక్కగా ప్రమోట్ చేశారు. ఈ బ్యానర్‌లో మరిన్ని సూపర్ హిట్లు రావాలి. నాయిక శ్రీలీల ఈ చిత్రానికి మరో ఆకర్షణ. తను రాబోయే రోజుల్లో పెద్ద స్టార్ అవుతుంది అన్నారు.
దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ రవితేజ డ్రమ్ము వాయిస్తేనే ఆ రోజుల్లో ఆల్లరి ప్రియుడు 250 రోజులు ఆడిరది. ఇప్పుడు డ్రమ్ము వాయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి అన్నారు. ధమాకా విజయం సమిష్టి కృషి అన్నారు నక్కిన త్రినాథరావు. రవితేజగారితో మరిన్ని సినిమాలు చేయాలుకుంటున్నాం అన్నారు టీజీ విశ్వప్రసాద్. ధమాకా విజయానికి ప్రధాన కారణం రవితేజ అన్న, ఆయన అభిమానులు అన్నారు ఈ చిత్ర కథా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. ఈ కార్యక్రమలో హరీష్ శంకర్, త్రినాథరావు. శ్రీలీల, వివేక్ కూచిభొట్ల, భీమ్స్ తదితరులు పాల్గొన్నారు.