సౌదీ అరేబియా వలసదారులకు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. రీ-ఎంట్రీ వీసా , రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ ఫీజును రెట్టింపు చేసింది. ఈ మేరకు ఆ దేశ మంత్రిమండలి కొత్త సవరణకు ఆమోదం తెలిపింది. ప్రవాసులు కింగ్‌డమ్‌కు బయట ఉండే కాల వ్యవధిని బట్టి ఈ రుసుము ఉంటుంది. దేశం నుంచి వెళ్లిన తర్వాత రెండు నెలల బయట ఉండి, తిరిగి ఎంట్రీ కావాలంటే రిటర్న్ వీసా 200 సౌదీ రియాళ్లు (రూ.4404) ఉంటుంది. అలాగే అదనపు నెలలకు మంత్లీ 100 రియాళ్లు(రూ.2202) ఉంటాయి. ఇది కేవలం ఒక్క ఎంట్రీ ట్రిప్‌కు మాత్రమే వర్తిస్తుంది. మల్టీ ఎంట్రీ ట్రిప్స్‌కు మూడు నెలలకు గాను 500 రియాళ్లు(రూ.11010), అదనపు నెలలకు ప్రతి మంత్‌కు 200 రియాళ్లు(రూ.4404) చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే విదేశీ కార్మికులు, గృహ కార్మికుల సహచరులకు రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణకు సంబంధించిన రెసిడెన్సీ చట్ట సవరణను కూడా కేబినెట్ ఆమోదించింది. కింగ్‌డమ్ వెలుపల ఉన్నప్పుడు రెసిడెన్సీ రెన్యువల్ రుసుము అంతర్గత మంత్రిత్వ శాఖ వసూలు చేసే దాని కంటే రెట్టింపు ఉంటుంది. దీంతోపాటు మరో కీలక సవరణకు సైతం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పౌరులకు 24 గంటల్లో పాస్‌పోర్ట్‌ను జారీ చేయడానికి అనుమతించే రెసిడెన్సీ, ట్రావెల్ డాక్యుమెంట్స్ సిస్టమ్‌కు సంబంధించిన సవరణను కేబినెట్ ఆమోదించింది.