Namaste NRI

ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది: మాజీ ఉప రాష్ట్రపతి

సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగాల్లో భారత్‌దే పైచేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్‌వైపు చూస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు పెర్కోన్నారు. దుబాయి పర్యటనలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నారైలు మూలాలను మరవకుండా, మనుగడను కొనసాగించి పురోభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలని పేర్కొన్నారు. జనని, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, చదువు చెప్పిన గురువులను ఎన్నడూ మరువరాదని. మనిషికి మాతృభాష కళ్ళవంటిదని అన్నారు. ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను కాపాడుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

భారతదేశంలో వేద, పురాణ కాలం నుండి మహిళకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. దానికి అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని, ప్రోత్సాహించాలని ఆయన కోరారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఉగ్గిన దినేష్ కుమార్ తన స్వాగత ఉపన్యాసంలో దుబాయిలో తెలుగు ప్రవాసీయుల సంస్కృతి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, స్ధానిక వ్యాపారవేత్త తోట రాంకుమార్‌లు వెంకయ్య నాయుడిని సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి వక్కలగడ్డ వేంకట సురేష్, ఆర్జె జాహ్నవిలు సంధానకర్తలుగా వ్యవహరించగా, శ్రీధర్ దామెర్ల, విజయ్ భాస్కర్, మోహన్, అంబేడ్కర్, లతా నాగేశ్, ఫహీమ్, శ్రీనివాస్ యండూరి, సురేంద్ర దండేకుల, నూకల మురళీ కృష్ణ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను సమన్వయం చేసారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events