అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఓ తెలుగమ్మాయి దుర్మరణం చెందింది. అక్కడి పోలీసు వాహనం ఢీకొని మృత్యువాత పడింది. సౌత్ లేక్ యూనియన్లోని సీటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం సోమవారం రాత్రి ఢీకొనడంతో భారత్‌కు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల చనిపోయినట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల సోమవారం రాత్రి 8 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పోలీసుల వాహనం ఢీకొట్టింది. వాహనం ఢీ కొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సీటెల్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మెడికో టీమ్ వచ్చే లోపు ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వారు ఆమె ప్రాణాలు రక్షించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాహ్నవిని హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే, ప్రమాదానికి కారణమైన అధికారి వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. ట్రాఫిక్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ డిటెక్టివ్స్ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.