అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలుగు కుర్రాడు అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్లో తన ప్రసంగాలతో అదరగొట్టి, విజేతగా నిలిచాడు. న్యూజెర్సీలో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా డిబెట్ లీగ్ టోర్నమెంట్లను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్లో పోటీ పడగా సాహిత్ మంగు గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు. సాహిత్ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ఏకధాటిగా చేసిన ప్రసంగం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. సాహిత్ను విజేతగా ప్రకటించిన జడ్జిలు అతడు ఎంచుకున్న అంశాలను, వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. న్యూజెర్సీలోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్లో సాహిత్ 7వ తరగతి చదువుతున్నాడు. హైదరాబాద్కు చెందిన సాహిత్ మంగు కుటుంబం న్యూజెర్సీలో స్థిరపడింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)