ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడు అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మారథాన్‌లలో ఒకటైన డిలీరియస్ వెస్ట్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇందులో భాగంగా సుకాంత్ సింగ్ సుకీ 102 గంటల 27 నిమిషాల పాటు 350 కిలోమీటర్ల దూరం పరిగెత్తి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ మారథాన్ ఫిబ్రవరి 8న మొదలై 12న ముగిసింది. 2020లో ఓమారు తాను మారథాన్‌లో పాల్గొన్నా 204 కిలోమీటర్ల పూర్తి చేశాక అనర్హతకు గురయ్యానని చెప్పుకొచ్చారు సుకాంత్. ఈసారి మారథాన్ కోసం ఆరు నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఛాలెంజ్‌ను దిగ్విజయంగా పూర్తి చేసిన నలుగురిలో నేను ఒకణ్ణి. అయితే మారథాన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాను అని ఆయన వ్యాఖ్యానించారు. సుకాంత్ సుకీ 2016 నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. కాగా.. మారథాన్ పూర్తి చేసిన సందర్భంగా తీసిన వీడియోను ఆయన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. మారథాన్‌ను పూర్తి చేసిన ఆయనకు స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలిపారు.