పాడి రైతులకు న్యాయం చేస్తామని, వారి పాలకి అమూల్ సంస్థ వారు చెల్లించే దానికన్నా తాము అధిక ధర చెల్లిస్తామని, ప్రతి ఒక్కరికీ తమ పాల నగదును త్వరగా చెల్లిస్తామని, అందులో సందేహం అక్కర్లేదని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. మండలంలోని నల్లగార్లపాడులో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ధరల వ్యత్యాసం కింద బోనస్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంగం డైయిరీ రైతుల భాగస్వామ్యంతో 40ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థ అని, సంగం సంస్థ హామీ ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఇటువంటి సంస్థను దెబ్బతీయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, అందుకనే అమూల్ సంస్థను తీసుకొచ్చిందని ఆయన అన్నారు. సంగం డెయిరీ ప్రస్తుతం కిలో వెన్నకు రూ.715 చెల్లిస్తుందని, దానిని ఆగస్టు ఒకటి నుంచి రూ.730కు పెంచుతామని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో రానున్న కాలంలో తమ పాలసేకరణను గణనీయంగా పెంచనున్నామని, ఈ ప్రక్రియను 13 జిల్లాల్లో విస్తరించనున్నామని చెప్పారు. బోనస్ ప్రక్రియలో భాగంగా పాల ఉత్పత్తిదారులకు రూ.8,19,196 అందజేశారు. నరసరావుపేట పాలశీతలీకరణ కేంద్రంలోనూ శుక్రవారం రైతులకు బోనస్ పంపిణీ చేశారు. సంగం డెయిరీ సంస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అనంతరంరైతులకు రాయితీపై యంత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ సీనియర్ మేనేజర్ డాక్టర్ శరత్‌బాబు, నరసరావుపేట శీతలీకరణ కేంద్రం మేనేజర్ వీరేంద్ర, నల్లగార్లపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ అధ్యక్షులు కోటిరెడ్డి, మాజీ అధ్యక్షులు యలమందారెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.