ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనీషియేటివ్ సమ్మిట్‌కు సౌదీ అరేబియా ఆహ్వానించింది. దీంతో వాతావరణ సంబంధిత అంశాల్లో భారత దేశానికి గల ప్రాధాన్యం వెల్లడవుతోంది. వాతావరణ మార్పులపై పోరాటంలో ప్రాంతీయ కృషికి నాయకత్వం వహించాలని సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సు అక్టోబరులో జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనీషియేటివ్, సౌదీ గ్రీన్ ఇనీషియేటివ్‌లను మార్చిలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఈ రెండు సదస్సులు వాతావరణ మార్పులకు సంబంధించిన కృషికి నాంది మాత్రమేనని తెలిపారు. వాతావరణ మార్పులతో పోరాటంలో సౌదీ అరేబియా, ఈ ప్రాంతం, ప్రపంచం మరింత వేగంగా ముందుకెళ్ళాలన్నారు.