బ్రిటన్‌లో భారతీయుల హవా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో ఇతర జాతీయుల కంటే మనోళ్లే టాప్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలయిన యునైటెడ్ కింగ్డమ్లో 2021 సెన్సస్ నివేదిక తెలిపింది. ఈ సెన్సస్ డేటా ప్రకారం ఆ దేశ పౌరుల కంటే భారత సంతతికి చెందిన ప్రజలే అత్యధిక విద్యావంతులుగా ఉన్నట్లు వెళ్లడయింది. అంతేగాక అధిక మంది ఎన్నారైలు సొంతిళ్లను కలిగి ఉన్నట్లు తేలింది. బ్రిటన్‌లో ఉండే ఇతర దేశాల ప్రవాసులతో పోలిస్తే భారతీయులు, చైనీయులే అత్యధిక స్థాయి విద్యను కలిగి ఉండడంతో పాటు వారిలో అత్యధిక సంఖ్యలో నిపుణులు ఉన్నారు.
ఇంగ్లండ్‌లోని భారతీయుల జనాభాలో 52 శాతం మంది అత్యధిక స్థాయి విద్యను కలిగి ఉన్నారు. ఈ విషయంలో 56 శాతంతో చైనీయులు మొదటి స్థానంలో ఉన్నారు. ఇళ్ల యాజమాన్యం విషయానికి వస్తే బ్రిటన్ వాసులు 68 శాతం మందికి మాత్రమే సొంతిళ్లు ఉన్నాయి. అదే మనోళ్లు ఏకంగా 71 శాతం మంది సొంత ఇళ్లను కలిగి ఉన్నారు. ఇక ఉపాధి పరంగా చూసుకుంటే భారత్, చైనాలకు చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులతో సహా వృత్తిపరమైన ఉద్యోగాలలో 34 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇకపోతే స్వతంత్ర కాంట్రాక్టర్ల కేటగిరీలో 10 శాతం భారతీయ ప్రవాసులు, 11 శాతం మంది వైట్ బ్రిటీష్ పౌరులు ఉన్నట్లు తెలిసింది.