నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు సంబరాల కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సంబరాలకు వచ్చే అతిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. సంబరాలకు విచ్చేస్తున్న ప్రముఖులు చాలా మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సహజ నటి జయసుధ, సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, బి.గోపాల్, డైలాగ్ కింగ్ సాయి కుమార్, ప్రముఖ హాస్య నటుడు ఆలీ, యువ నటుడు ఆది సాయికుమార్, యువ దర్శకులు గోపిచంద్ మలినేని, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సేవే గమ్యం నా నినాదం.. విధానం: బాపయ్య చౌదరి(బాపు) నూతి, నాట్స్ అధ్యక్షుడు
నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలబడుతుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి తెలిపారు. భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదం అని దానికి తగ్గట్టుగానే నాట్స్ సేవా కార్యక్రమాలు చేపడుతోందని బాపు నూతి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, అమెరికాలో నాట్స్ నిర్వహిస్తున్న హెల్ప్ లైన్ సర్వీసుల గురించి బాపు నూతి వివరించారు.
సంబరాల్లో ఈ సారి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు: రాజ్ అల్లాడ, నాట్స్ తెలుగు సంబరాల ఉప సమన్వయకర్త
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలుగు సంబరాల ఉప సమన్వయకర్త రాజ్ అల్లాడ తెలిపారు. అమ్మ నాన్న లకు సత్కారం అనే కార్యక్రమం తల్లిదండ్రులకు మనం ఇచ్చే గౌరవం అని ఇది అనుబంధాలను పెంచుతుందని రాజ్ అల్లాడ తెలిపారు. అమెరికాకు వచ్చి స్థిరపడిన వారు తమ తల్లిదండ్రులకు సంబరాల వేదికపై సత్కారం చేయించే కార్యక్రమం అని వివరించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు మధ్య ఓ వారధిలా షార్క్ అండ్ డ్రీమర్స్ కార్యక్రమం ఉండబోతుందన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు కాకినాడ పోర్ట్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్, కె.వి. రావు, రెయిన్ బో హాస్పిటల్స్ అధినేత రమేశ్ కంచర్ల, ప్రముఖ వ్యాపార రంగ ప్రముఖులు రామినేని నాని, స్టార్ హాస్పిటల్స్ అధినేత గోపిచంద్ తదితరులు ఈ సంబరాల్లో వ్యాపార సదస్సులకు ప్రత్యేక అతిధులగా హాజరవుతారని తెలిపారు. అమెరికా నుంచి పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి వ్యాపార సదస్సులో పాల్గొనున్నారని తెలిపారు. కేవలం ఆట, పాట మాత్రమే కాకుండా మరెన్నో ఉపయుక్తమైన కార్యక్రమాలు సంబరాల్లో ఉన్నాయని రాజ్ అల్లాడ పేర్కొన్నారు.
సంబరాల అంతిమ లక్ష్యం సేవే..
అమెరికా తెలుగు సంబరాల అంతిమ లక్ష్యం కూడా సేవే అని శ్రీధర్ అప్పసాని స్పష్టం చేశారు. సంబరాల ద్వారా వచ్చిన ధనంలో నూటికి 15 శాతం తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ సంస్థలకు విరాళంగా అందించనున్నామని తెలిపారు. సుమారు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఇలా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ కోసమే వినియోగించే అవకాశముందని శ్రీధర్ అప్పసాని పేర్కొన్నారు. నాట్స్ వేస్తున్న ఈ ముందడుగు మరిన్ని తెలుగు సంఘాలకు ఆదర్శంగా మారుతుందన్నారు. గతంలో కూడా నాట్స్ సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు సంఘాల దశ, దిశను మార్చడంలో తొలి అడుగు వేసిందని తెలిపారు.
తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు
తెలుగుదనం ఉట్టిపడేలా ఎన్నో కార్యక్రమాలు తెలుగు సంబరాల్లో ఉంటాయని శ్రీధర్ అప్పసాని తెలిపారు.
ముఖ్యంగా తెలుగు సినీ అతిరథ మహారథులైన ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలను నాట్స్ సంబరాల వేదికపై నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖ గాయని సుశీల, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరీ, సహజనటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విచ్చేయనున్నారని తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో స్వర్గస్తులైన ప్రముఖ సినీ నటులు కృష్ణ, కృష్ణంరాజులకు కూడా సంబరాల వేదికపై ఘన నివాళులు అర్పించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలకు కృష్ణ కుటుంబం నుంచి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కృష్ణంరాజు కుటుంబం నుంచి ఆయన భార్య శ్యామలదేవి విచ్చేయనున్నారని తెలిపారు. అమెరికా తెలుగు
సంబరాలకు రావాలంటూ పవన్ కల్యాణ్, బాలకృష్ణ లను ఆహ్వానించామని శ్రీధర్ అప్పసాని తెలిపారు. అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు సినీ రంగ ప్రముఖులు సాయి కుమార్, ఆది సాయి కుమార్, ఆలీ, ఎల్.బి. శ్రీరామ్, సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, దర్శకుడు గోపిచంద్ మలినేని, అవసరాల శ్రీనివాస్, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సిరాశ్రీ, హీరోయిన్స్ పరియా అబ్ధుల్లా , హెబ్బా పటేల్, ప్రియాంక జవలేకర్, ప్రవీణ్ కడియాల, బిగ్ బాస్ విన్నర్స్ సన్నీ, బిగ్ బాస్4 ఆర్టిస్టులు సోహైల్, హిమజ తదితరులు సంబరాలకు విచ్చేస్తున్నారని శ్రీధర్ అప్పసాని తెలిపారు. నాట్స్ చేపట్టిన సేవ కార్యక్రమాలకు నచ్చి తాము ఆహ్వానించగానే నాట్స్ తెలుగు సంబరాలకు వస్తున్న ప్రతి ఒక్క అతిథికి నాట్స్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
సంబరాల్లో హోరెత్తతున్న తెలుగు సినీ సంగీతం
అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, థమన్‌లు సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారని శ్రీధర్ అప్పసాని తెలిపారు. వీరితో పాటు ఎలిజియం బ్యాండ్ కూడా సంగీతంతో యువతను ఊర్రూతలూగించనున్నారని శ్రీధర్ వివరించారు.
నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం: అల్లు అరవింద్
అమెరికాలో తెలుగువారి కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలపై అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ అండగా నిలబడటంలో నాట్స్ చూపుతున్న చొరవ అభినందనీయం అన్నారు. అలాగే తెలుగుజాతి ప్రముఖులను స్మరించుకునేలా చేపట్టిన శత జయంతి ఉత్సవాలను ఆయన కొనియాడారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనేందుకు వస్తున్నానని అల్లు అరవింద్ తెలిపారు.
మన కోసం..మన మేలు కోసం నాట్స్: సాయికుమార్
ఎప్పుడూ మనం అని ఆలోచిస్తేనే ఈ సమాజం బాగుంటుందని.. అలా ఆలోచించే సంస్థే నాట్స్ అని ప్రముఖ నటుడు సాయికుమార్ అన్నారు. మన తెలుగువారి కోసం.. మన తెలుగుకళల కోసం.. ఆలోచించడమే కాకుండా చేతనైనా సాయం చేస్తూ ముందుకు సాగుతున్న నాట్స్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని సాయి కుమార్ తెలిపారు. నాట్స్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు తనకెంతో నచ్చాయని సాయి కుమార్ తెలిపారు. అమెరికా తెలుగు సంబరాలకు తాను వస్తున్నానని అక్కడ అందరిని కలుస్తానని స్పష్టం చేశారు.
నాట్స్ సేవా కార్యక్రమాలు భేష్: జయసుధ
సాటి తెలుగువారికి సాయం చేయాలని నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సహజనటి జయసుధ అన్నారు. తెలుగు కళలకు, కళకారులకు నాట్స్ ఎంత గౌరవం ఇస్తుందనేని నాట్స్ సంబరాల్లో చేపట్టిన శత జయంతి ఉత్సవాలే నిదర్శనమని జయసుధ అన్నారు. అమెరికా తెలుగు సంబరాలకు తాను విచ్చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
తెలుగువారికి అండగా నాట్స్ : ఆలీ
నాట్స్ ఏర్పడిన నాటి నుంచి తనకు నాట్స్‌తో అనుబంధం ఉందని ప్రముఖ నటుడు ఆలీ తెలిపారు. నాట్స్ ఆవిర్భావ వేడుకలకు అమెరికాకు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నాట్స్ చేపట్టే కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందన్నారు. ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు నాట్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆ శత జయంతి ఉత్సవాల్లో తాను కూడా పాలుపంచుకోవడం అదృష్టమని తెలిపారు.
తెలుగు సంబరాలకు వెళ్తున్నందు సంతోషంగా ఉంది: చంద్రబోస్
తెలుగు భాష ప్రేమికులను, తెలుగు భాష సైనికులను అమెరికాలో కలుసుకోబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
తెలుగు సంబరాలకు వెళ్లడం నా అదృష్టం: గోపిచంద్ మలినేని
నాట్స్ సంబరాల్లో ఎన్టీఆర్, ఘంటసాల, అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు చేస్తున్న వేళ నేను ఆ సంబరాలకు వెళ్లడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.