భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ లాకప్‌లో మృతి చెందిన మరియమ్మ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా?’’ అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మరియమ్మ మృతి ఘటనపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్ మార్టం పూర్తైందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా మృతురాలి కుటుంబానికి 15 లక్షల రూపాయల పరిహారం, ఉద్యోగం కూడా ఇచ్చామని తెలిపారు. ఈ ఘటనలో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఆలేరు మెజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. ఆ నివేదిక అందిన నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.