అమెరికాకు చెందిన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారేమో. అక్కడే ఉంది అసలు కథ. అమెరికా కు చెందిన ఆండ్రూ క్లార్క్, కరోలిన్ క్లార్క్ దంపతులు. వీరికి ఇప్పటికే ఒక మగబిడ్డ ఉన్నాడు. ఇటీవల ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సారి అమ్మాయి పుట్టింది. దీంతో ఆ కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. అమ్మాయి పుడితే ఆశ్చర్యం ఎందుకు అని అనుకుంటున్నారు కదూ. ఎందుకంటే, దాదాపుగా 130 ఏండ్లకుపైగా ఆండ్రూ కుటుంబంలో ఇప్పటి వరకూ అమ్మాయే పుట్టలేదంట. ఇలాంటి అరుదైన ఘటన జరిగితే ఎవరికి మాత్రం ఆశ్చర్యం వెయ్యదు చెప్పండి. ఆండ్రూ కుటుంబం కూడా అమ్మాయి పుట్టగానే ఆశ్చర్యపోయిందట మరి.
1885 తర్వాత ఆండ్రూ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడం ఇదే తొలిసారి. అమ్మాయి పుట్టడం మా అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అని ఆండ్రూ చెప్పుకొచ్చాడు. అనంతరం కరోలిన్ మాట్లాడుతూ పదేండ్ల క్రితం ఆండ్రూతో డేటింగ్ ప్రారంభించాను. అప్పుడు చాలా కాలంగా తమ కుటుంబంలో ఆడపిల్ల లేదని నా భర్త చెప్పాడు. అప్పుడు నేను నమ్మలేదు. ఈ విషయం గురించి ఆండ్రూ తల్లిదండ్రులను అడిగాను. వాళ్లు కూడా అదే చెప్పారు. వంద సంవత్సరాలకు పైగా ఆండ్రూ కుటుంబం తరఫున అమ్మాయి పుట్టలేదని వాళ్లు చెప్పాకే నాకూ తెలిసింది. అప్పుడు నేను షాక్ అయ్యాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 130 ఏండ్ల తర్వాత అమ్మాయి రాకతో కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నట్లు ఆ జంట తెలిపింది.