తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోలేకనే విద్యార్థుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి రేపేందుకు పేపర్ లీకేజీలతో బీజేపీ మరో కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహారమని ధ్వజమెత్తారు. పథకం ప్రకారమే పేపర్ బయటకు వచ్చిందన్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి అయిన బండి సంజయ్ వెంటనే తన ఎంపీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు తెర లేపిందని మండిపడ్డారు. అధికారం కోసం అడ్డ దారులు తొక్కుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక పోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో బండి సంజయ్ లాంటి నాయకులు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.