అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. నేడు అల్లు అర్జున్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హంట్ ఫర్ పుష్ప పేరుతో కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప కోసం పోలీసుల వేట, అడవిలో బుల్లెట్ గాయాలతో పుష్ప దుస్తులు కనిపించడం, పుష్పకు మద్దతుగా ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం వంటి సంఘటనలతో కాన్సెప్ట్ వీడియో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అంటూ పుష్ప పలికే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. పుష్ప చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా ఎదిగిన పుష్ప, రెండో భాగంలో ప్రజల్ని ఆదుకునే రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరేస్లో క్యూబా బ్రోకెజ్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, పాటలు: చంద్రబోస్, సీఈఓ: చెర్రీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-22.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-23.jpg)