శ్రీలంక క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర 800 పేరుతో వెండితెర దృశ్యమానం కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో పాపులర్ అయిన మధూర్ మిట్టల్ స్పిన్ మాంత్రికుడి పాత్రను పోషిస్తున్నారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వం. సుదీర్ఘ కెరీర్‌లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్‌గా మురళీధరన్ రికార్డు సృష్టించారు. అందుకే ఈ సినిమాకు 800 టైటిల్ పెట్టామని దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ మురళీధరన్ క్రికెట్ ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథ మాత్రమే కాదిది. ఓ సాధారణ యువకుడి ధైర్యసాహసాలకు, అసమానతలకు ఎదురొడ్డి గెలిచిన సంకల్పబలానికి నిదర్శనంగా ఉంటుంది. క్రికెట్ గురించి ఏమీ తెలియనివారికి కూడా ఉత్కంఠకు గురిచేస్తుంది అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-101.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-49.jpg)
తొలుత ఈ బయోపిక్‌ను విజయ్ సేతుపతితో తీస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. అయితే తమిళనాట వ్యతిరేకత రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తమిళ మూలాలు కలిగిన మురళీధరన్ శ్రీలంకలో పుట్టిపెరిగారు. జాఫ్నా కేంద్రంగా నడిచిన తమిళ వేర్పాటువాద ఉద్యమానికి మురళీధరన్ వ్యతిరేకంగా ఉన్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-45.jpg)