రష్యా సర్కార్‌పై విమర్శలు చేస్తున్న వ్లాదిమిర్ కరా ముర్జా కు 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. దేశద్రోహం కేసులో అతనికి ఈ శిక్షను ఖరారు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై విమర్శలు చేస్తున్న కేసులో అతన్ని అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. జర్నలిస్టు అయిన ముర్జా తాను రాసిన ప్రతి పదానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు. తాను రాసిన కథనాల పట్ల తానేమీ చింతించడం లేదని, గర్వంగా ఉందని అన్నారు. ఉక్రెయిన్ వార్‌పై విమర్శనాత్మక కథనాలు రాసిన ముర్జా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా కూడా విమర్శలు చేశారు. రష్యా అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకునేలా పాశ్చాత్య ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చే విధంగా ముర్జా తన కథనాలను రాశారు.