సుడాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. కాగా, ఈ అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రతి భారతీయుడి ని సురక్షితంగా తరలిస్తామని కేంద్ర విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సుడాన్ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నంచి అక్కడి పరిస్థితులను నిరంతరం కంట్రోల్ రూమ్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని ఘర్షణ ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించి, అక్కడి నుంచి వారిని స్వదేశానికి తీసుకురావడంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. సుడాన్లో 3,500 మంది భారతీయులు, 1000 మంది భారత సంతతి వ్యక్తులు చిక్కుకొని ఉండొచ్చన్నారు. ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటి వరకు 1,700 మందికిపైగా భారతీయుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.