ఒలింపిక్స్ ఎప్పుడైనా ఎక్కడైనా పతకాల పట్టికలో దాదాపు అగ్రరాజ్యం అమెరికాదే ఆధిపత్యం. ఈసారి లెక్క తప్పలేదు. టోక్యోలోనూ అమెరికానే అగ్రపీఠాన్ని అలంకరించింది. మరో రోజులో ఒలింపిక్స్ ముగుస్తుందనగా స్వర్ణాల్లో చైనా (38) కంటే వెనుకంజలో నిలిచిన అమెరికా (36) ఈసారి అగ్రస్థానాన్ని కోల్పోతుందేమో అన్న అనుమనాలు కలిగించింది. కానీ ఆఖరి రోజు మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న అమెరికా (39), చైనా(38)ను ఒకే ఒక్క పసిడి తేడాతో వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. చివరి రోజు చైనా ఒక్క స్వర్ణమూ గెలవకపోవడం అమెరికాకు కలిసొచ్చింది. ఒక దశలో ఈ రెండు దేశాలు చెరో 38 స్వర్ణాలతో సమానంగా ఉండగా, వాలీబాల్ మహిళల జట్టు అనూహ్యంగా పసిడి గెలడంతో అమెరికా పైచేయి సాధించింది. మొత్తం మీద అమెరికా 113 (39 స్వర్ణ, 41 రజత, 33 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో నిలవగా, చైనా 88 (38 స్వర్ణ, 32 రజత, 18 కాంస్యాలు), ఆతిథ్య జపాన్ 58 (27 స్వర్ణ, 14 రజత, 17 కాంస్యాలు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.