ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి క్విట్ ఇండియా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. భారత స్వాతంత్య్ర సమరంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే చిత్రాలను ఇందులో ప్రదర్శించారు. ఆనాటి బహిరంగ దస్తావేజులు, ప్రైవేటు లేఖలు, మ్యాప్‌లు, ఫొటోలు, ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి. ఆగస్టు 9 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఉదయం 10` సాయంత్రం 5:30 వేళల్లో ఈ ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
స్వాతంత్య్ర సంగ్రామం భారతీయుల ఏకత, శక్తి, అంకితభావాన్ని ప్రపంచానికి చాటిందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్ని దశాబ్ధాలు గడిచినా ఆ ఉద్యమానికున్న ప్రాధాన్యం తగ్గదని అభిప్రాయపడ్డారు. సామ్రాజ్యవాదుల కంబంధ హస్తాల నుంచి భరత జాతికి విముక్తి కల్పించిన మహనీయుల త్యాగాలను రాబోయే తరాలకు చాటిచెప్పడానికే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్‌రామ్ మేఫ్‌ువాల్, మీనాక్షి లేఖి పాల్గొన్నారు.