ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన, గాయపడిన బాధితులకు ధైర్యం అందించాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వైట్ హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే భారత్, అమెరికా దేశాలను ఏకం చేస్తున్నాయని జో బైడెన్, అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయుల వెంట యావత్ అమెరికా ఉందని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.